కన్నబిడ్డల కోసం రక్తాన్ని చెమటగా మార్చి, రెక్కలు ముక్కలు చేసుకుని ఆస్తులు సంపాదించి పెడితే... అదే బిడ్డలు వృద్ధాప్యంలో ఆ కన్నతండ్రిని అనాథగా రోడ్డుపైకి నెట్టేశారు. కొడుకులు బుక్కెడు అన్నం పెట్టకపోవడంతో ఆ వృద్ధాప్య భారంతో మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తున్నాడు ఓ కన్నతండ్రి
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల లస్మయ్య అనే వృద్ధుడు... ప్రస్తుతం మంచిర్యాల రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటూ పొట్ట నింపుకుంటున్నాడు. కష్టపడి ఆస్తులు సంపాదించి ఎంతో ఆశతో పెంచి పెద్ద చేసిన కొడుకులు... తండ్రి వయసు పైబడిన తర్వాత కనీసం అన్నం పెట్టడానికి కూడా నిరాకరించారంటూ లస్మయ్య కన్నీరుమున్నీరవుతున్నాడు.
ఆస్తులన్నీ తీసుకుని నన్ను నడిరోడ్డుపై వదిలేశారు... బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు అంటూ ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు స్థానికులను సైతం కలచివేస్తున్నాయి. కన్నబిడ్డలే కాదనుకున్న వేళ... ఇకనైనా ప్రభుత్వ అధికారులు, మానవతావాదులు స్పందించి తనకు న్యాయం చేయాలని, వృద్ధాశ్రమంలోనైనా ఆశ్రయం కల్పించాలని ఆ తండ్రి దీనంగా వేడుకుంటున్నాడు.
